నేను – నా దేవుడు

సౌఫల్యం పెద్ద పెద్ద విషయాలలో ఉంటుంది. సంతోషం చిన్న చిన్న విషయాలలో ఉంటుంది. ధ్యానం శూన్యంలో ఉంటుంది. దేవుడు అన్నిటిలోనూ ఉంటాడు. నా శరీరంలో నరనరాన, కణకణాన, అణువు అణువునా నిండిన నా హీరో, నా అధ్యక్షుడు – నా మార్గదర్శి- నా ఐశ్వర్యం – నా సర్వస్వం – పవన్ కళ్యాణ్ అనే ఆరు అక్షరాల నా దేవుడు. ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి ఆయన గురించి ఎక్కడ మంచి వాక్యాలు చదివినా, విన్నా ఆయనకే అన్వయించుకుంటూ ఆయన్నే ఆవాహన చేసుకుంటూ ముందుకు వెళ్లుచున్నాను.

ఐన్ స్టీన్ తన జీవితాన్నంతంటిని ధారపోసి ఈ ప్రపంచానికి కొన్ని సిద్ధాంతాలను అందించాడు. అప్పటినుంచి ఈ ప్రపంచం అంతకు ముందు ఉన్నట్టు లేకుండా పోయింది. ఎడిసన్ జీవితం ప్రపంచంలోని మనుషుల జీవిత విధానాన్ని మార్చేసింది. మహాత్మాగాంధి, నెల్సన్ మండేలా ఒక కొత్త సంస్కృతికి జన్మనిచ్చారు. మిల్టన్ ఠాగూర్ కవిత్వానికి కొత్త నిర్వచనాన్నిచ్చారు. త్యాగయ్య సంగీతానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. జాకీర్ హుస్సేన్ తబలాకి ఒక కొత్త హోదాను కల్పించాడు. రోజర్ బానిస్టర్, హెడ్మండ్ హిల్లరీ మానవుల సామర్ధ్యాన్ని కొత్తగా నిర్వచించారు. సోక్రటీస్, అరిస్టాటిల్, ప్లాటో ప్రపంచం ఆలోచించే విధానాన్ని మార్చివేసారు. ప్రతి ఒక్క మానవజాతికి తనను తాను ఉన్నత స్థితికి తీసుకొని వెళ్లే సామర్ధ్యమే కాక, మానవ జాతి సమిష్టి చైతన్యాన్ని కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్లే శక్తి ఉంది. మన ముందు తరంలో చాలామంది మానవ చైతన్య వికాసానికి తమ వంతు పాత్రను నిర్వహించారు. దాని తాలుకా ఫలితాలను అనుభవిస్తున్నాము. మరి మనం నిర్వహించబోయే పాత్ర ఎటువంటిది? ఆ దిశగా నేను చేస్తున్న ప్రయత్నము నా దేవుడితో కలసి ఆయన మార్గంలో నడవడం.

రాజకీయమంటే ఇదే అని వేళ్లూనుకున్న ఈ సంస్కృతికి చరమగీతం పాడి రాజకీయమంటే సేవ, రాజకీయమంటే దోచుకోవడం కాదు, ఆదుకోవడం. రాజకీయమంటే పేదరిక నిర్మూలన. రాజకీయమంటే సామాజిక న్యాయం, సమానత్వాన్ని నిలబెట్టడం. రాజకీయమంటే కుల, మతాలకు అతీతంగా మానవత్వాన్ని నింపడం. ఇవన్నీ కలగలిపి నా అధ్యక్షుడి ఆశయాలు అయితే ఈ రాజకీయ మార్పు కోసం వచ్చిన దేవుడు కాక మనిషి అని ఎలా చెప్పగలం ?

అందుకే నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు.
ఏంటిది? నేనేనా ఎప్పుడో ఇంటర్, డిగ్రీ వయస్సులో రాసిన చూసిన, చదివిన, అన్ని విషయాలు ప్రవాహంలా గుర్తొస్తున్నాయి. ఇది నా గొప్పతనమా? కానే కాదు. నా దేవుడితో గడిపిన క్షణాలు, మాట్లాడిన తరువాత ఆయన ఔన్నత్యమే, నా కలంలో పరిగెడుతోంది. టి.వి. డిబేట్లలో చర్చలో పాల్గొనే వాళ్లందరితో అధ్యక్షుడు రేపు కలిసి మాట్లాడుతాడు అని మేసేజి రాగానే బయలుదేరి మంగళగిరి ఆఫీసుకు వెళ్లాను. ఉదయం 11 గంటల పైన అందరం కూర్చొని ఉండగా ఒక బక్కపలుచని, అందమైన శరీరంతో, నిటారుగా మన ప్రక్కింటి, ఎదురింటి వ్యక్తిలా ఒక లైట్ రోస్ కలర్ షర్టు, క్యాజువల్ ప్యాంటులో అత్యంత సింపుల్గా, నిటారుగా నడుచుకుంటూ వచ్చి మా ముందు ఆసీనులై చిరునవ్వుతో ప్రారంభించారు. ప్రతి విషయాన్ని కాచి వడపోసిన వ్యక్తిలా మాట్లాడుచున్నాడు. భగవద్గీత, రామాయణం, బైబిల్, ఖురాన్, సైన్స్, వ్యవసాయం, రైతులు, మహిళలు, దాడులు, కేసులు, ఇలా అన్ని విషయాల మీద గీతలో కృష్ణుడిలా బోధిస్తున్నాడు. ఈయనకు తెలియని విషయం ఏమైనా ఉందా? అని నా మస్తిష్కంలో చిన్న అనుమానం. అయినా దేవుడికి అన్ని తెలుస్తాయిలే. నాకు నేనే సమాధానం ఇచ్చుకుంటున్నా.

బాధ్యత గుర్తు చేస్తున్నప్పుడు గురువులా, తప్పు సరిదిద్దుకోండి అని చెబుతున్నప్పుడు తండ్రిలా, చిరునవ్వుతో సమస్యలకి పరిష్కారమార్గం చూపిస్తున్నప్పుడు తల్లిలా, మళ్లీ కలుద్దాం అని ప్రేమతో చెప్పి వెళ్లుతున్నప్పుడు మా బిడ్డలా, అన్ని రూపాలలో నా దేవుడు. పెదవి చివరి వరకు వచ్చి ఒకమాట ఆగిపోయింది. స్వామి దిష్టి తీసుకోండి, నా దిష్టే తగిలేటట్లు ఉంది అనబోయి ఆగిపోయాను. అయినా దేవుడికి దిష్టి ఏంటి? నా తిక్కగాక పోతే. ఏంటి ఈయన. ఇన్ని విషయాలు ఎలా తెలుసు. ఇంత ఖచ్చితంగా విలువలతో, నిలువెత్తు నిజాయితీతో, పర్ఫెక్ట్, ప్రాక్టికల్గా దేవుడు గాక మరేంటి?
ప్రకృతి ఒడిలో ఉన్నప్పుడు మనష్యులు ఎప్పుడూ చక్కగా ఆలోచించగలుగుతారు. ఎందుకంటే మనసు లోని ఆకర్షణను మరింత పెంచే సృజనాత్మకమైన వికర్షణలు ప్రకృతి ప్రసాదించగలదు. నా ప్రకృతి నా దేవుడే కదా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అన్ని అంశాల్లో ఒక ఆణిముత్యం, నేను అర్ధం చేసుకున్న రీతిలో రెండు వాక్యాలు మీ ముందు ఉంచుతాను.
“నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. మీరు శిఖరాగ్రానికి చేరుకోవాలంటే జీవితంలో అన్నిటికి, ముఖ్యంగా రాజకీయాలలో ఎదుర్కొనే ధోరణి మీకు అవసరం. ఈ ధోరణి మీలో రూపొందించేదేమిటి? నిజాయితీ.
నా దేవుడి ఆలోచనా విధానం తప్పు, ఒప్పు, గెలుపు, ఓటములు సమానంగా చూస్తూ, తప్పును సరిదిద్దుకొని ఒప్పుగా, ఓటమి సమీక్షించుకొని గెలుపుగా మార్చే సమ్మోహనా శక్తి ఎలా అని ప్రశ్నించకండి?
సముద్రంలో ఉప్పు నీరు.
మురుగు నీటి కాలువలు
కంపుకొట్టే నీటి గుంటలు.. పాచి పట్టిన చెరువులు వీటిలో వేటినుంచి అయినా నీరు ఆవిరై
మళ్లీ క్రిందకు వానగా కురిస్తే
అది స్వచ్చమైన మంచి నీరుగా మారి
త్రాగేందుకు పనికి వస్తుంది.
ప్రార్ధనలు పైకి వెళితే…
ఆశీస్సులు క్రిందకు వస్తాయి. అదే నా దేవుడు.
ఇంతటి మంచితనాన్ని
ఇంతటి ఔన్నత్యాన్ని
ఇంతటి సాధారణతను
ఇంతటి ప్రేమను
ఆయన గాక మరెవరు పంచగలరు.
భగవద్గీత ద్వారా నా దేవుడికి
“మన్యసే యది తచ్చుక్యం
మయా ద్రష్టు మితి ప్రభో |
యోగీశ్వర తతో మేత్వం
దర్శ యాత్మాన మవ్యయం ॥”
పవన్ కళ్యాణ్ అనే ఒక యోగీశ్వర అట్టి నీ యొక్క దివ్య మంగళ స్వరూపమును చూచుటకు సాధ్యంబగునని తలచితివేని సంపూర్ణముగా నాకు దర్శనము ఇచ్చుటకు కరుణింపుము.

పై వాక్యములు ఎందుకు ఉదహరించానంటే, నేను ఎప్పుడు తిరుమల వెళ్లినా వెంకటేశ్వర స్వామి అద్భుత రూపాన్ని ఆరాధనగా చూస్తాను. కానీ బయటకు వస్తానే మళ్లీ చూడాలనిపించేలా ఆయన దివ్య మంగళ రూపాన్ని మరచిపోతాను. అలాగే వపన్ కళ్యాణ్ గారిని కూడా ఎంతసేపు చూసి వచ్చినా మళ్లీ చూడాలి అనే నా మనస్సు కోరిక.

ఆయన దేవుడు గాక మరెవ్వరు.
చివరగా !
మీ ఉనికిని మనస్సుతో తెలుసుకుంటూ, మీ సౌందర్యాన్ని అనుభూతి చెందుతూ మీ కాంతిని అనుభవిస్తూ నా నమ్మకానికి, శక్తికి మూలం మీరు నే వెళ్లే దారి.. గమ్యము మీరే నేను ఎల్లప్పుడూ మీతో సంబంధం కలిగి ఉంటాను. నాదంటూ ఏమీ లేదు. అంతా మీదే…

వినమ్రుడనై, పాదాభివందనాలతో….

  • మీ తాతంశెట్టి నాగేంద్ర –
  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి