ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు పతకాల పంట!

మూడో ప్రపంచకప్‌ స్టేజ్‌ 3 టోర్నీలో భారత స్టార్‌ ఆర్చర్‌ దీపికా కుమారి మూడు స్వర్ణ పతకాలతో దుమ్ము రేపింది. మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఉత్సాహం నింపే విజయం సాధించింది.

ప్రపంచ నెంబర్ వన్‌ టీం కొరియా ఈ టోర్నీలో పాల్గొనలేదు. దీంతో భారత ఆర్చర్లకు పెద్ద పోటీ ఎదురు కాలేదనే చెప్పాలి. మహిళ వ్యక్తిగత, టీం, మిక్స్‌డ్‌ పెయిర్‌ విభాగాల్లో వరుసగా పసిడి పతకాలు సాధించారు. ఈ అన్ని విభాగాల్లో దీపిక ఉండడం గమనార్హం. పైగా ఒకే రోజు ఐదు గంటల వ్యవధిలోనే ఈ ఈవెంట్లన్నీ జరిగాయి. టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించిన కొరియా, చైనా, చైనీస్‌ తాయ్‌పీ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాయి. దీంతో పతకాలన్నీ భారత్‌ వశమయ్యాయి.

అంతకుముందు అభిషేక్‌ వర్మ కాంపౌండ్‌ విభాగంలో శనివారం బంగారు పతకం సాధించాడు. అలాగే మహిళల రికర్వ్‌ విభాగంలో దీపికా, అంకితా భకత్‌, కోమాలిక బరి బృందం సైతం మెక్సికో టీంపై అలవోకగా విజయం సాధించి పసిడిని సొంతం చేసుకున్నారు.