టీ -20లో దుమ్ములేపిన మంత్రి హరీష్ రావు

టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన నాయకుడు హరీష్‌ రావు. ప్రస్తుతం తెలంగాణ కెబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి. రాజకీయాల్లో నిరంతరం బిజిబిజీగా గడుపుతూ.. రాజకీయాల్లో ట్రబుల్‌ షూటర్‌గా పేరు తెచ్చుకొన్న హరీష్‌ రావు.. నిన్న ఓ ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌లో క్రికెటర్‌ అవతారమెత్తి అభిమానుల్లో జోష్ నింపారు. మొన్నటి వరకు జీ హెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఫుల్‌ బిజీ గా ఉన్న మంత్రి హరీష్‌ రావు. ఒక్కసారిగా బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి సిద్ధిపేట-హైదరాబాద్ జట్ల మధ్య ఫ్రెండ్లీ టీ-20 మ్యాచ్ జరిగింది. సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ జట్టుకు మంత్రి హరీశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ టీమ్ మెంబర్ గా ఆడారు. ఇక హైదరాబాద్‌ మెడికోవర్‌ హస్పిటల్ జట్టుకు డాక్టర్‌ కృష్ణకిరణ్‌ కెప్టెన్సీ చేశారు.

ముందుగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ జట్టు బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన సిద్దిపేట జట్టు నిర్ణిత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 165పరుగులు చేసింది. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగిన హరీష్ రావు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. 12బంతుల్లో 3 ఫోర్లతో 18పరుగులు చేసి అలరించారు. వరుసగా రెండు బౌండరీలు కొట్టి హరీష్ రావు దుమ్ములేపి చూపించారు.  మైదానంలో ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ లా బ్యాటింగ్‌ చేసిన హరీష్‌ ను చూసి ప్రేక్షకులు, అభి మానులు కేరింతలు కొట్టారు.

 ఈ మ్యాచ్ లో హరీష్ రావు నేతృత్వం వహిస్తున్న సిద్దిపేట జట్టు హైదరాబాద్ పై 15పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చూస్తేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు.