మాజీ ప్రధాని పీవీకి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్‌

మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని కొనియాడారు. పీవీ గొప్ప దార్శనికుడని, తెలంగాణ ముద్దుబిడ్డ అని అన్నారు. ఈమేరకు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదులు, తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి’ అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

మాజీ ప్రధాని పీవీ ఘనతను చాటేలా ఏడాదిపాటు నిర్వహించిన శత జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. పీవీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో ఉన్న జ్ఞానభూమిలో ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరగనుంది. ఉత్సవాల్లో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. జ్ఞానభూమిలో పీవీ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరిస్తారు. అదేవిధంగా పీవీ ఆర్థిక సంస్కరణలు, పాలనారీతులు, చరిత్రపై ప్రభుత్వం ముద్రించిన తొమ్మిది పుస్తకాలను ఆవిష్కరిస్తారు.