పారాలింపిక్స్‌లో సత్తా చాటిన షట్లర్లకు మోదీ అభినందనలు

పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత షట్లర్లు ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ కూడా సత్తా చాటారు. శనివారం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్‌లో భారత షట్లర్ ప్రమోద్ భగత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన డేనియల్ బెతెల్‌ను వరుస సెట్లలో ఓడించి స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయాడు.

అలాగే కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్‌కే చెందిన మనోజ్ సర్కార్.. జపాన్ క్రీడాకారుడు దైసుకే ఫుజిహరాను మట్టికరిపించి పతకం సాధించాడు. వీరిద్దరినీ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ప్రమోద్ భగత్ అద్భుతమైన ప్రదర్శన దేశప్రజల మనసులను దోచుకుందని కొనియాడారు. అతని విజయం లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించారు.

అలాగే మనోజ్ సర్కార్ చక్కని ఆటతీరుతో దేశానికి కాంస్య పతకం తీసుకొస్తున్నాడని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. ఈ విజయాలతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 17కు చేరింది. వీటిలో 4 బంగారు పతకాలు, 7 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.