ఏటీఎం కార్డు లేకుండా మనీ డ్రా: కొటక్ మహీంద్రా

కొటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, ఐసీఐసీఐ బ్యాంకులు ఇలాంటి సేవల్ని అందిస్తున్నాయి. కస్టమర్లు డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏటీఎం కార్డు మర్చిపోయినా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డబ్బులు డ్రా చేయొచ్చు. మీరు కొటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్ అయితే ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేయడం మాత్రమే కాదు, ఎవరికైనా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇందుకోసం ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీని ప్రారంభించింది బ్యాంకు.

కొటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు ఏటీఎంల నుంచి కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాల్స్ చేయాలంటే కొటక్ మొబైల్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ కావాలి. పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్ లాంటి వివరాలతో మొదటిసారి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ విత్‌డ్రాయల్ ఫెసిలిటీ వివరాలు ఎంటర్ చేయాలి. మీరు ఇతరులకు డబ్బులు పంపాలంటే బెనిఫీషియరీ వివరాలు కూడా రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత మీరు కార్డు లేకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఎంచుకోవాలి. లేదా ఇతరులకు డబ్బు పంపాలంటే ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ సెలెక్ట్ చేయాలి.