ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్

యూఏఈ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన ముంబై మరోసారి ఫైనల్‌ చేరింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ అన్ని విభాగాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ముంబై జట్టు ఢిల్లీని 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి టీ20 లీగ్‌ 13వ సీజన్‌లో తొలి ఫైనల్‌కు దూసుకెళ్లిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్‌ 2020లో ముంబై ఇండియన్స్ జయకేతనం ఎగురవేసి దర్జాగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఓడిన ఢిల్లీకి మాత్రం మరో అవకాశం ఉంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి బంతి నుంచే వీరకుమ్ముడు మొదలుపెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, పొలార్డ్‌లు డకౌట్ అయినా, మిగతా బ్యాట్స్‌మెన్ మాత్రం చెలరేగిపోయారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చివర్లో బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 14 బంతుల్లో 5 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు.

ఇక డికాక్ 40 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ (51), ఇషాన్ కిషన్ (55, నాటౌట్)లు అర్థ సెంచరీలతో అదరగొట్టారు. కృనాల్ పాండ్యా 13 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా, నార్జ్, స్టోయినిస్ చెరో వికెట్ తీసుకున్నారు. డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాల వీర విహారంతో 200 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఆ తర్వాత 201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 143 పరుగులు మాత్రమే చేసి 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికి పృథ్వీషా, ఐదో బంతికి అజింక్య రహానేలు డకౌట్ అయ్యారు. ఆ తర్వాతి ఓవర్ రెండో బంతికి శిఖర్ ధవన్ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.