సీఎంఆర్‌ఎఫ్‌కు మైహోం గ్రూపు రూ.5 కోట్ల విరాళం, చెక్ అందజేత

గత నెలలో హైదరాబాద్‌ నగరంలో గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వానలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. పలువురు మృతిచెందగా, లోతట్టు ప్రాంతాల్లోని అనేక కుటుంబాలు నిరాశ్రయం చెందాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఆపత్కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మై హోం సంస్థ తన వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి 5 కోట్ల రూపాయలు వరద బాధితుల సహాయార్థం ఇస్తున్నట్లు మై హోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు అప్పుడు ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన కార్పొరేట్ సిటిజన్‌గా తన వంతు బాధ్యతతో ఈ విరాళం ఇస్తున్నట్లు రామేశ్వర్ రావు తెలిపారు. తాజాగా అందుకు సబంధించిన చెక్‌ను జూపల్లి రామేశ్వర్ రావు తనయుడు రాము సీఎం కేసీఆర్‌కు అందజేశారు.