‘మా’ సభ్యత్వానికి నాగబాబు గుడ్ బై..!

‘మా’ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు నటుడు నాగబాబు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టు, మిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్‌ లో కొనసాగడం నాకు ఇష్టం లేక ‘మా’ అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. సెలవు. రాజీనామాని 48 గంటల్లో నా స్టాఫ్‌ మా అసోసియేషన్‌ కి పంపిస్తారు. ఇది నేను ఎంతగానో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్దితో తీసుకున్న నిర్ణయం’’


ఓ ఫోటో ద్వారా ‘మా’ ఎలా అయ్యిందో వివరించే ప్రయత్నం చేశారు నాగబాబు. అందులో అందరూ ఓ వైపు వెళ్తుంటే, ఒకరు మాత్రం ఇంకో దారిలో వెళ్తున్నారు. ‘మా’ సభ్యులు వెళ్తున్న దారిని, అదే సమయంలో ‘మా’ రెండుగా చీలిన విధానాన్ని చూపించే ప్రయత్నం చేశారు. తాజా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు తెలిపారు నాగబాబు. ఫలితాల్లో ప్రకాష్ రాజ్ ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు నాగబాబు, మంచు విష్ణు మధ్య మాటల యుద్దం నడిచింది. ఈ నేపథ్యంలోనే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు నాగబాబు.