కొత్త చట్టాలు రైతు సంఘాలు, విపక్షాలు కోరినవే: ప్రధాని మోదీ

రైతు చట్టాలపై ప్రతిపక్షాలు అన్నదాతలను రెచ్చగొడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. వ్యవసాయ సంస్కరణలు (కొత్త చట్టాలు) నిజానికి ఇన్నేళ్ళుగా రైతు సంఘాలు, విపక్షాలు కోరినవే అన్నారు. అయితే ఆ ప్రతిపక్షాలే ఇప్పుడు వారిని ఆందోళనలకు ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు. గుజరాత్ లోని ఈ రోజు కచ్‌ ప్రాంతంలోని పెద్ద సంఖ్యలో ఉన్న సిక్‌ సాగుదారులతో పాటు వ్యవసాయ సంఘ సభ్యులతో ప్రధాని సమావేశమయ్యారు. అలాగే, సరిహద్దు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి పార్క్, డీశాలినేషన్ ప్లాంట్, మిల్క్ చిల్లింగ్ ప్లాంట్ ఉన్నాయి.  

ఈ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. ప్రభుత్వం ఎప్పుడూ రైతు సంక్షేమాన్నే కాంక్షిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటుందని అన్నారు. ఈ రోజు ప్రతిపక్ష నేతలు అన్నదాతలను రెచ్చగొడుతున్నారు.. కానీ వారి (కాంగ్రెస్) హయాంలో వ్యవసాయ సంస్కరణలకు అనుకూలంగా వ్యవహరించలేదా ? అప్పుడు వారో నిర్ణయం తీసుకోలేకపోయారు, నేడు దేశం ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నప్పుడు అన్నదాతలను వారు తప్పుదారి పట్టిస్తున్నారు అని మోదీ అన్నారు. రైతులను అయోమయంలో పడవేసేందుకు దేశ రాజధాని చుట్టూ కుట్ర జరుగుతోంది అని ఆయన పేర్కొన్నారు. కొత్త చట్టాలు వస్తే రైతుల భూములను ఇతరులు లాక్కుంటారని వారిని భయపెడుతున్నారని, మీ నుంచి పాలను సేకరించే ఓ పాడి సంస్థ మీ పశువులను కూడా లాక్కుంటుందా అని మోదీ ప్రశ్నించారు.

గుజరాత్ లో రైతులకు, సహకార సంఘాలకు స్వాధికారాన్ని ఇచ్చామని, వ్యవసాయదారుల విషయాల్లో ప్రభుత్వ జోక్యం లేదని మోదీ అన్నారు. పరిస్థితులకు తగినట్టు మనం కూడా మారాలి, ప్రపంచ ఉత్తమ పద్దతులకు అనుగుణంగా మనం కూడా నడుచుకోవాలి అన్నారాయన. కచ్ లోని రైతులు తమ పండ్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆయన తెలిపారు. కాగా- గత నెలలో జరిగిన తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మోదీ రైతు చట్టాల రద్దు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అప్పుడు కూడా విపక్షాలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందేమిటి అని ప్రశ్నించారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధమైన చట్టాలపై ఆలోచన చేసిందని, కాంట్రాక్టు వ్యవసాయానికి అనుకూల వైఖరి ప్రదర్శించిందని ఆయన నాడు పేర్కొన్నారు.