వారికే అనుమతి.. అంతర్జాతీయ ప్రయాణాలపై అమెరికా కీలక నిబంధనలు

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి అమెరికా కీలక నిబంధనలను ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన విదేశీ ప్రయాణికులకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి కానుంది. ప్రయాణికులంతా వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా.. కొవిడ్‌ టెస్టు రిపోర్టులను సమర్పించాల్సి ఉంటుంది. నవంబరు 8 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల జాబితాను బైడెన్‌ సర్కారు విడుదల చేసింది. ఇందులో ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలు, నియమాలను వెలువరించింది. రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులనే నవంబరు 8 నుంచి అమెరికాలోకి అనుమతించనున్నారు. వీరంతా విమానంలో ఎక్కేముందే తమ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లను సమర్పించాలి. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన టీకాలతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతులు జారీ చేసిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికే అమెరికాలోకి ప్రవేశం ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. అనుమతించిన మిక్సింగ్‌ టీకాలను తీసుకున్నా.. ప్రయాణాలు చేయవచ్చు. టీకా తీసుకున్నప్పటికీ.. ప్రయాణానికి ముందు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని సమర్పించడం తప్పనిసరి కానుంది. మూడు రోజులలోపు పరీక్షించిన నమూనా ఫలితాలనే సమర్పించాలి. ఈ నిబంధన విదేశీ ప్రయాణికులతో పాటు అమెరికా పౌరులకు, చట్టబద్ధమైన శాశ్వత నివాసులకూ వర్తిస్తుంది.

వ్యాక్సిన్‌ తీసుకోనివారికీ
పలు మినహాయింపులతో వ్యాక్సిన్‌ తీసుకోని విదేశీయులనూ అమెరికాలోకి అనుమతించనున్నారు. 18 ఏళ్లలోపు పిల్లలు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకునే నిబంధన లేదు. వీరు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న 18 ఏళ్లు పైబడిన వారితో కలిసి ప్రయాణిస్తే.. మూడు రోజులలోపు తీసిన కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు సమర్పించాలి. అదే, వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకోని వారితో కలిసి ప్రయాణిస్తే.. కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం 24 గంటల లోపుదై ఉండాలి. రెండేళ్ల లోపు పిల్లలకు కొవిడ్‌ పరీక్షలు అవసరం లేదు. వ్యాక్సినేషన్‌ ధ్రువీకరణ పత్రం.. పేపర్‌ ఫార్మాట్‌లో లేదా డిజిటల్‌ రూపంలోనైనా ఉండొచ్చు. ఈ సర్టిఫికేట్‌లో ప్రయాణికుడి పేరు, పుట్టిన తేదీ, వ్యాక్సిన్‌ రకం, డోసులు తీసుకున్న తేదీ ఉండాలి.