అంధకారంలో పాకిస్థాన్

పాకిస్థాన్ లో చిమ్మచీకట్లు అలముకున్నాయి. సాంకేతిక లోపాలతో విద్యుత్ గ్రిడ్ కుప్పకూలడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గతరాత్రి పవర్ గ్రిడ్ లో తలెత్తిన సమస్యతో పాక్ లోని అన్ని విద్యుత్ ప్లాంట్లు నిలిచిపోయాయి. దేశ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు లాహోర్, రావల్పిండి, కరాచీ, ముల్తాన్, ఫైసలాబాద్ వంటి ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. 21 కోట్ల మంది జనాభా చీకట్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన పాక్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు వెల్లడించింది. దేశంలో మిగతా భాగాల్లోనూ విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు సాంకేతిక నిపుణుల బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు పాకిస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి ఒమర్ అయూబ్ ఖాన్ తెలిపారు.