చైనాతో కలిసి మరో కుట్రకు తెర తీస్తున్న పాకిస్తాన్

చైనాతో కలిసి పాకిస్తాన్ మరో కుట్రకు తెరతీస్తోంది. చైనా తయారు చేసిన మానవరహిత వైమానిక వాహనాలు కొనుగోలు చేసి వాటిని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో మొహరించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోంది. మధ్యస్త ఎత్తులో ఎక్కువసేపు గాల్లో ఎగరగలిగే శక్తి కగిలిన ఈ మానవరహిత విమానాలను ఎల్ఓసి వద్ద మొహరించడం ద్వారా జమ్ముకాశ్మీర్‌లో మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడేలా చేసి అల్లకల్లోలం సృష్టించవచ్చనేది పాకిస్తాన్ కుట్ర వెనుక ఉన్న ఆలోచనగా తెలుస్తోంది. భద్రతా బలగాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చైనా నుంచి భారీ సంఖ్యలో కై హాంగ్-4 అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్‌ని  కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది.

పాకిస్తాన్ బ్రిగేడియర్ మొహమ్మద్ జాఫర్ ఇక్బాల్ నేతృత్వంలో 10 మంది ఆర్మీ అధికారుల బృందం ఈ కొనుగోలు ప్రక్రియను సమీక్షించేందుకు చైనాను సందర్శించినట్టు తెలిసింది. చైనాలోని ఏరోస్పేస్ లాంగ్ మార్చ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీ నుండి కొనుగోలు చేసిన వాటి ఫ్యాక్టరీ యాక్సెప్టెన్స్ టెస్ట్ కోసమే ఈ బృందం చైనాకు వెళ్లినట్టు సమాచారం.