ప్రజారోగ్యం పట్టని పార్వతీపురం పురపాలన

  • తాగునీటి కుళాయిల్లో బురద నీరు సరఫరా
  • రోగాల బారిన పడుతున్న పట్టణ ప్రజలు
  • కుళాయిల్లో మంచినీరు సరఫరా చేయాలని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: పార్వతీపురం పురపాలక సంఘానికి ప్రజారోగ్యం పట్టడం లేదని జనసేన పార్టీ నాయకులు అన్నారు. ఆదివారం ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాభత్తుల దుర్గాప్రసాద్, కర్రిమణి, కొల్లి వెంకటరావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాకాలం ఆరంభమైందో లేదో అప్పుడే పార్వతీపురం మున్సిపాలిటీ మంచినీటి కుళాయిల్లో బురద నీరు సరఫరా ప్రారంభమైందన్నారు. ఈ బురద నీరు మళ్లీ జనవరి ఫిబ్రవరి నెల వరకు కంటిన్యూ అవుతుందన్నారు. ఈ బురద నీటిని తాగుతున్న ప్రజలు ఇప్పటికే టైఫాయిడ్, దగ్గు, జలుబు, గొంతు నొప్పులు, కండ్లకలకలు తదితర రోగాలతో బాధపడుతున్నారన్నారు. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీలో మంచినీటి కుళాయిల్లో తాగునీరు అందిస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశ ఎదురయింది అన్నారు. కనీస అవసరమైన తాగునీరు అందివ్వలేని పాలన సాగుతుందన్నారు. పాలకులు, అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కనీసం తాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క పార్వతీపురంలోనే ఏటి నీరు తాగటం లేదని రాష్ట్రంలో అనేక పెద్దపెద్ద పట్టణాల ప్రజలు నదులు నీరే తాగుతున్నారన్నారు. ఆయా పట్టణాలకు బురద నీరు రాని కుళాయిల్లో పార్వతీపురంలో మాత్రం ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. ఇదే వైసిపి పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రస్తుత ఏపీ టిడ్కో చైర్మన్ అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఒకసారి కుళాయిల్లో బురద నీరు వస్తే ఆయనే స్వతహాగా బురద నీటిని మంచినీరుగా మార్చే విధానంతో ట్రైల్ రన్నర్ గా కొన్ని రోజులు బురద నీటిని, మంచినీరుగా మార్చి కుళాయిల్లో సరఫరా చేసారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పని ఇప్పుడు ఎందుకు వైసీపీ నాయకులు చేయడం లేదని ప్రశ్నించారు. గద్దెనెక్కేందుకు పలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్న పాలకులు ప్రజలకు మంచినీరు ఇవ్వలేని దుస్థితిలో ఉండటం సిగ్గు చేటన్నారు. ఇప్పటికే రోజూ ఇవ్వాల్సిన కుళాయిలు, వారానికి, ఐదు రోజులకు, నాలుగు రోజులకు చొప్పున ఇస్తుండడంతో పాటు ఆ ఇచ్చిన నీరు కూడా బురద నీరు ఇవ్వటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తక్షణమే పాలకులు, అధికారులు స్పందించి కుంటి సాకులు, పిట్ట కథలు చెప్పకుండా ప్రజలకు మంచినీటి కుళాయిల్లో స్వచ్ఛమైన నీటిని అందించి ప్రజారోగ్యాన్ని రక్షించాలని కోరారు.