నర్సులకు ప్రపంచ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పాటంశెట్టి

జగ్గంపేట, నవజాత శిశువు భూమిమీద అడుగిడే సమయంలో పురిటి నొప్పులు పడుతున్న తల్లిని ఓదారుస్తూ బాసటగా ఉంటూ జన్మ, పునర్జన్మల వారథిగా నిలుస్తూ మనిషి పుట్టుక మొదలు, శారీరర, మానసిక రుగ్మతలతో, గాయాలతో వైద్యశాలలో ఆశ్రయం పొందినప్పుడు ఔదార్యంతో వేళకు ఔషదాలను అందిస్తూ, బాధ్యతతో జాగ్రత్తలు చెబుతూ, ఓర్పుతో పరిచర్యలు చేస్తూ మనసును కుదుట పరిచే మంచిమాటలతో రోగిలో స్పూర్తిని, నమ్మకాన్ని పెంపొందిస్తూ తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునే దిశగా డాక్టరుతో పాటు అంతకంటే ఎక్కువ పాళ్లే రోగికి ప్రత్యక్షంగా సేవలను అందించే ఉన్నతమైన, ఔదార్యమైనది, సేవా పూర్వకమైనది నర్సు వృత్తి. రోగులకు వారికి ఎలాంటి పేగు బంధం లేదు.. అయినా కన్న వారికన్నా, కడుపున పుట్టిన వారి కన్నా మిన్నగా ఆదరించి సేవలందించే దయామయులు. తాము సేవ చేసే వ్యక్తి ఎవరో, వారి వ్యక్తిత్వమేమిటో, దొంగలో దొరలో, శత్రువులో మిత్రులో, ఈ దేశీయులో, పరదేశీయులో పట్టించుకోకుండా సేవలందించే ఉదాత్త చరితలు నర్సులు. ఇంజక్షన్‌ ఇవ్వడం మొదలు సీరియస్‌గా ఉండి బెడ్‌రిడెన్‌ అయిపోయిన పేషెంట్‌కు స్పాంజ్‌బాత్‌ చేయించడం, బెడ్‌ ప్యాన్‌ అరేంజ్‌ చేయడం వంటి అత్యవసర పనుల వరకూ నర్సమ్మ చేసే సేవలు అద్వితీయం. ఇంట్లో సొంత మనుషులు కూడా వారి అంత అభిమానంగా, ఓపికగా సేవ చేయరంటే అతిశయోక్తి కాదు. డ్యూటీకి వచ్చింది మొదలు డ్యూటీ దిగి వెళ్ళే వరకు అలుపు ఆయాసం లేకుండా, విసుగూ విరామం లేకుండా, క్షణం విశ్రాంతి తీసుకోకుండా ప్రాణాలున్న మరబొమ్మల్లా పనిచేస్తారు. వారు చేసే సేవలు అమూల్యమైనవి. ఆస్పత్రిలో సందడిగా తిరిగే నర్సమ్మ జీవితంలో సమస్యలెన్నో సంగ్రామ భేరీలు మోగిస్తూ మనశ్శాంతిగా ఉండనివ్వవు. షిఫ్ట్‌లలో పనిచేస్తూ వేళకు తిండిలేక, సమయానికి నిద్రలేక, పరామర్శించే పరిస్థితిలేక, సమాజంలో చెప్పుకోదగ్గ గుర్తింపులేక, చాలీచాలని జీతాలతో జీవితాలను బొటాబొటిగా, కటాకటిగా నడిపించే అభిశప్త జీవనులు నర్సులు. వారి కళ్ళు నవ్వుతున్నా ఆ నవ్వుల మాటున ఎన్నో జాలి కథలూ వ్యధలూ దోబూచులాడుతుంటాయి… అయినా ఆస్పత్రిలో ఉన్నంతసేపు బయటపడకుండా దాచిపెట్టి మానవసేవకు దిగే పరమకారుణికోత్తమలు నర్సులు అంటూ జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర నర్సులందరికీ సేవాభివందనములు మరియు శుభాకాంక్షలు తెలిపారు.