పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్.. సరికొత్త రికార్డులు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వెండితెర మీద చూసి చాలా రోజులే అయింది. అందుకే వకీల్ సాబ్ సినిమా విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక సోమవారం నాడు మొదట సినిమా థియేటర్లలో ట్రైలర్ ను విడుదల చేశారు. పలు సినిమా థియేటర్లలో వకీల్ సాబ్ ట్రైలర్ ను ప్రదర్శించగా.. అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఆ తర్వాత యూట్యూబ్ లో విడుదల చేయడంతో భీభత్సమైన వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది. వేగంగా లైక్స్ అందుకున్న సినిమా ట్రైలర్ రికార్డును పవన్ కళ్యాణ్ అభిమానులు బద్దలు కొడుతూ ఉన్నారు.

‘వకీల్ సాబ్’ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. కోర్టు, వాదనల నేపథ్యంలో వచ్చే సీన్లలో మరింత శక్తిమంతంగా కనిపించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా… ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న వకీల్ సాబ్ చిత్రానికి దిల్ రాజ్, ఆయన సోదరుడు శిరీష్ నిర్మాతలు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న రిలీజ్ అవుతోంది. 2018లో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించగా, మళ్లీ ఇన్నాళ్లకు ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వకీల్ సాబ్ ట్రైలర్ పై హీరో రామ్ చరణ్ స్పందించాడు. “బాబాయ్… మైండ్ బ్లోయింగ్” అంటూ ట్రైలర్ పై వ్యాఖ్యానించాడు. “ఎప్పట్లాగానే పవర్ ఫుల్ గా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ లో హిట్టయిన ‘పింక్’ చిత్రాన్ని పవన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న సినిమా విడుదల అవుతూ ఉండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నిడివిని పెంచేసినట్లు చిత్ర బృందం ఇప్పటికే తెలిపింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ట్రైలర్ సూపర్ అంటూ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు.