జగన్ మేనిఫెస్టోని ప్రజలు నమ్మట్లేదు: మండలి రాజేష్

అవనిగడ్డ: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోని రాష్ట్రంలోని ప్రజలెవరూ నమ్మట్లేదని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు మండలి రాజేష్ అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు వడ్రాణం మార్కండేయ బాబులు పాల్గొన్నారు. అవనిగడ్డ రాజీవ్ చౌక్ లో మండలి రాజేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికలలో జగన్మోహనరెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలో మద్యపాన నిషేదం చేస్తానని, ప్రతియేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, మరెన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఐదేళ్లలో ఒక్కసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా జి.ఓ నంబర్ 117 తీసుకుని వచ్చి ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేసి డీఎస్సీ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జి.ఓ నంబర్ 117 ని రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ మొదటి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ మీదనే అని ప్రకటించడం కూడా జరిగిందని రాజేష్ అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించే వారు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మండలి బుద్ధప్రసాద్, వల్లభనేని బాలశౌరిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.