జనం జగ “నో అంటున్నారు”

  • నో కేపిటల్, నో స్పెషల్ స్టేటస్ అని జగన్ అంటే.. ఓటర్లు నో వైసీపీ అంటున్నారు
  • రక్తం లేకుండా యుద్దం, కేసులు లేకుండా రాజకీయం చేయలేం
  • సత్యవేడు జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

సత్యవేడు: రక్తం లేకుండా యుద్దం, కేసులు లేకుండా రాజకీయం చేయలేమన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. శనివారం సత్యవేడులో జరిగిన జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.‌ ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు కష్టంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అండగా నిలిస్తే.. జనసేనలో ఉన్న యువశక్తిని అనుభవం ఉన్న టిడిపి నాయకులు అక్కున చేర్చుకున్నారన్నారు. 14 ఏళ్లు సిఎంగా పనిచేసిన చంద్రబాబుకు అధికారం అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఆశయం కోసం వచ్చారన్నారు. ఎపి ప్రజల విజయం కోసం ఇద్దరు నేతలు నిస్వార్థంగా కలిశారన్నారు. టిడిపి నాయకులు, కేడర్ ను భయపెట్టడానికే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. నో కేపిటల్, నో పోలవరం, నో లిక్కర్ బ్యాన్, నో స్పెషల్ స్టేటస్ అంటున్న జగన్ కు ప్రజలు నో వైసీపీ అంటూ బుద్ది చెప్పబోతున్నారన్నారు. ధనం, దౌర్జన్యం, దొంగ ఓట్లు అనే ఆయుధాలతో జగన్ గెలవాలని చూస్తున్నారన్నారు. ధనం, దౌర్జన్యాలను ఇప్పటికే ఎదుర్కొన్నామని, ఇప్పుడు దొంగ ఓట్లును సవాల్ గా తీసుకొని వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దొంగ ఓట్లపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని తెలిపారు.