ప్రజల సమస్యలు గాలికి వదిలేసిన ఆళ్ల నాని

ఏలూరు: ప్రజల సమస్యలను, మౌలిక సదుపాయాలను గాలికి వదిలివేసి సమీక్ష సమావేశాల పేరుతో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కాలయాపన చేస్తున్నారని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి అప్పలనాయుడు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏలూరు నియోజకవర్గంలోని రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయన్నారు. కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో రోడ్లు సౌకర్యం లేక ప్రజలు దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. కొత్తూరు నుంచి ఏలూరుకు రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలో ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదని, అయితే పన్నులను మాత్రం ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వంగాయిగూడెం అంబేద్కర్ విగ్రహం నుంచి కొత్తూరు క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిందని, పెద్ద పెద్ద గోతులు దర్శనం ఇస్తున్నాయని, ఈ గోతులు వల్ల ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులతోపాటు స్థానిక ప్రజలు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇక పిల్ హౌస్ పేట ప్రాంతం పరిస్థితి మరీ అధ్వానంగా తయారయిందన్నారు. అనేకమంది ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్వానంగా తయారైన రహదారులపై ఉన్న గోతులు ఎమ్మెల్యే ఆళ్ళ నానికి కనిపించడం లేదా అని రెడ్డి అప్పలనాయుడు ప్రశ్నించారు. ఇటీవల వేసిన కైకలూరు రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతిందన్నారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణాల్లో అలసత్వం వహిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రజలను అధికార పక్షం ప్రజా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మును నియోజకవర్గంలోని కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అధ్వానంగా తయారైన రోడ్లను తక్షణం నిర్మించాలని మేయర్, కమిషనర్, మొద్దు నిద్రపోతున్న ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు.