ప్రతి గ్రామంలో ప్రజల్లో వస్తున్న స్పందనే టీడీపీ-జనసేన-బీజేపీ విజయానికి సంకేతం: హరీష్

అమలాపురం, టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజల సంపూర్ణ మద్దతని ఎంపీ అభ్యర్థి హరీష్ బాలయోగి పేర్కొన్నారు. ప్రతి పల్లెలో కూటమి అభ్యర్థులకు లభిస్తున్న అపూర్వ స్పందనే దీనికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అంబాజీపేట మండలంలోని పసుపల్లి, మక్కామల గ్రామాల్లో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్యం కీలకమని తెలిపారు. దీనికి అనుగుణంగా అమలాపురం పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.