నేటినుంచి పీజీఈసెట్ రెండోవిడత కౌన్సెలింగ్‌

తెలంగాణలో  ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించిన పీజీఈసెట్‌ రెండోవిడత కౌన్సెలింగ్ ఇవాళ ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ నేటి నుంచి ఈ నెల 23 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్లు, ఆన్‌లైన్‌ పేమెంట్‌, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. కౌన్సెలింగ్‌కు అర్హులజాబితా 26న ప్రకటిస్తామని పీజీ ఈసెట్‌ కన్వీనర్‌ రమేష్‌ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

26, 27 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. 28న సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లను ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉందని, 30న జాబితా ప్రకటిస్తామని తెలిపారు. సీటు ఖరారు అయిన విద్యార్థులు జనవరి 6 లోపు కాలేజీలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు.