14 సార్లు ప్లాస్మా దానం.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ముంబై: మహారాష్ట్రలోని పూణేకు చెందిన 50 ఏండ్ల వ్యక్తి రికార్డుస్థాయిలో 14 సార్లు ప్లాస్మాను దానం చేశారు. కరోనా రోగులకు తన వంతు సహాయం చేస్తున్న ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. వ్యూహాత్మక సలహాదారుగా పనిచేస్తున్న 50 ఏళ్ల అజయ్ మునాట్‌కు గత ఏడాది జూన్‌లో కరోనా సోకింది. ఈ సందర్భంగా ప్లాస్మా దానం గురించి తెలుసుకున్న ఆయన కోలుకున్న 28 రోజుల్లో తొలిసారి ప్లాస్మాను దానం చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 14 సార్లు ప్లాస్మాను దానం చేశారు. 15వ సారి కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

మరోవైపు అజయ్ గొప్ప చర్యను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. దేశంలో అత్యధికంగా ప్లాస్మాను దానం చేసిన వ్యక్తిగా ఆయనకు సర్టిఫికేట్ అందజేసింది. “అభినందనలు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, 2022 కింద గరిష్ఠంగా ప్లాస్మా దానం చేసిన వ్యక్తిగా మిమ్మల్ని ఖరారు చేశాం. మీరు చూపిన కృషి, సహనాన్ని మేము అభినందిస్తున్నాము. మీ నైపుణ్యాలను గుర్తించాము. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటోరియల్ బోర్డ్ ధృవీకరణ ప్రకారం ఉత్తమంగా ఎంపికైన వ్యక్తిగా మిమ్మల్ని ఆమోదించాము ” అని ఆ సర్టిఫికేట్‌లో పేర్కొంది.

కాగా, తాను ఇప్పటికే 40 సార్లు రక్తం దానం చేశానని అజయ్ తెలిపారు. దీనికి తన తల్లి స్ఫూర్తి అని ఆయన చెప్పారు. తన తల్లి చాలా సార్లు రక్తం దానం చేయడాన్ని తాను చిన్నప్పటి నుంచి చూశానని అన్నారు. అందుకే తాను కూడా రక్త దానం చేస్తున్నట్లు చెప్పారు.

కరోనా బారిన పడి కోలుకున్న అనంతరం డాక్టర్‌ను సంప్రదించానని, ప్లాస్మా డొనేషన్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని ఆయన చెప్పారని అజయ్ వెల్లడించారు. దీంతో నాటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ప్లాస్మాను దానం చేశానని, మరోసారి కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.