పీఎల్‌ఐ పథకం లక్ష్యమదే: ప్రధాని మోదీ

దిల్లీ: దేశీయ తయారీ రంగాన్ని విస్తరించడంతో పాటు ఎగుమతులను పెంచే లక్ష్యంతోనే ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రతిఒక్క వాటాదారుడు ఈ పథకంలో నిమగ్నమై ఉండాలని సూచించారు. పీఎల్‌ఐ పథకంపై ఏర్పాటు చేసిన వెబినార్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి, కీలక రంగాల పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు.

‘దేశీయ తయారీ రంగానికి ఊతమిచ్చే చర్యల్లో భాగంగా అనుమతుల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్రాల వద్ద వివిధ స్థాయిల్లో ఉన్న దాదాపు 6వేల అనుమతుల భారాన్ని తగ్గించేందుకు కృషిచేస్తున్నాం. స్వీయ నియంత్రణ, స్వీయ ధృవీకరణ మార్గంలోనే సంస్థలు ముందుకు వెళ్లడమే అనువైన మార్గం’అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇక పీఎల్‌ఐ రంగాల్లో వచ్చే ఐదేళ్లలో శ్రామికశక్తి రెట్టింపు అవుతున్నట్లు అంచనా వేస్తున్నానని అన్నారు. ఉత్పత్తిని పెంచడం వల్ల ఉద్యోగ కల్పనకు వీలు కలుగుతుందని, ఇందులో భాగంగా తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిందన్నారు. ఉత్పత్తుల ఖర్చు, నాణ్యత, సామర్థ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేటట్లు మనమందరం కృషి చేయాలని ప్రధాని మోదీ పారిశ్రామికవేత్తలకు సూచించారు.

ప్రైవేటు రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించి, దేశీయ ఉత్పత్తులను పేంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం మేకిన్‌ ఇండియా ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆయా రంగాలకు మొత్తం దాదాపు రూ.2లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించిన విషయం తెలిసిందే.