పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేదు..

ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిధుల విషయంలో ఎటువంటి సమస్య లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఆర్దిక శాక కేబినెట్ నోట్ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు.

ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు గురించి పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావనకొచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఆర్దిక శాఖ నోట్‌లో 2013-14 ధరల ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని నిర్ణయించామని..నిధులకు ఎలాంటి సమస్య లేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ శెకావత్ స్పష్టం చేశారు. 2022 లోగా ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన అని..నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా ప్రాజెక్టు పనులపై ప్రభావం పడుతోందని విజయసాయి రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. 2017 లెక్కల ప్రకారం రివైజ్డ్ కాస్ట్ కమిటీ అంచనాలు తయారు చేసిందని..దీన్ని పరిశీలించి కేబినెట్ నిర్ణయానికి పంపుతామని మంత్రి సమాధానమిచ్చారు.

కేబినెట్ నిర్ణయం మేరకు సవరించిన అంచనాలపై ముందుకు వెళ్తామని..నిధులకు ఏ సమస్యా లేదని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని రీయింబర్స్‌మెంట్ పద్ధతిలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆర్అండ్ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగం పెంచాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మరో మూడు నెలల్లో స్పిల్ వే పనులు పూర్తవుతాయని..కాపర్ డ్యాం పూర్తయిన తరువాత 41 మీటర్ల స్థాయిలో నీళ్లు నిల్వ చేస్తామన్నారు. లక్ష ఎకరాల్లో భూమి మునుగుతుందని..41 మీటర్ల ఎత్తులో నీళ్లు నిల్వచేసినప్పుడు నిర్వాసితులయ్యేవారికి తొలి విడతలో ఆర్ఆండ్ఆర్ ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పారు. 35 శాతం మంది ప్రజల్ని వేరే ప్రాంతానికి తరలించినట్టు తెలిపారు.