అల్లు అర్జున్ పై పోలీస్ కేస్ అప్ డేట్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతం వద్దకు ఫ్యామిలీతో వెళ్లి హడావిడి చేసి వచ్చారు. తన ఫ్యాన్స్ తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో కొంతమంది అల్లు అర్జున్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అనుమతులు లేకుండా కుంటాల జలపాతం వద్దకు వెళ్లారని, సినిమా షూటింగ్ చేశారని ఆరోపిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులకు కూడా ఈ ఫిర్యాదులందాయి. కొంతమంది సిబ్బంది అల్లు అర్జున్ కోసం హడావిడి చేశారని, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పరువు తీసారని  ఆరోపించారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

అయితే ఫిర్యాదు తీసుకున్న స్థానిక పోలీసులు ఈ విషయంపై తగు విచారణ జరిపిన తర్వాతే కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు మూడో కంటికి తెలియకుండా చక్కబడుతుంటాయి. అయితే అప్పుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయింది. అల్లు అర్జున్ పై కేసు పెట్టారు అన్నంత హడావిడి చేశారు. ఇక యూట్యూబ్ ఛానెళ్లు అయితే.. రక రకాల టైటిల్స్ తో విన్యాసాలు చేశాయి. ఇప్పుడు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ పై ఫిర్యాదు పెట్టినవారితో గీతా ఆర్ట్స్ సిబ్బంది మాట్లాడారట. ఈ వ్యవహారాన్ని అక్కడితో ఆపేయాలని, పెద్దది చేయొద్దని కోరారట. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్నారట. దీంతో ఈ కేసు వ్యవహారం అటకెక్కేసిందని అంటున్నారు. పోలీసులుకు వారిచ్చిన ఫిర్యాదు కూడా వెనక్కి తీసుకునే అవకాశం ఉందట. అంటే విచారణ లేకుండానే ఈ కంప్లయింట్ వెనక్కి వెళ్లిపోతుందనమాట. అయితే ఆ రోజు తాము షూటింగ్ చేయలేదని, కేవలం ఫ్యామిలీ టూర్ లాగా మాత్రమే జలపాతం దగ్గరకు వెళ్లామని అల్లు అర్జున్ వివరణ ఇచ్చుకున్నారట. సినిమావాళ్లు కాబట్టి ఫ్యామిలీతో దిగే ఫొటోలకు కూడా మంచి అప్డేటెడ్ కెమెరాలు వాడటంతో.. దాన్ని షూటింగ్ అనుకుని స్థానికులు వ్యవహారాన్ని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు.