ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

అమరావతి: కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామంటూ ఇప్పటి వరకూ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లో ఉండటం.. కేసుల సంఖ్య దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించే అవకాశముండటంతో పరీక్షల నిర్వహణపై చర్చించారు. కర్ఫ్యూ అమలయ్యే సమయంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది పడే అవకాశముందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో వాయిదా వేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. జులైలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది.