కన్నుల పండువగా గూడెంలో పౌర్ణమి జాతర

పవిత్ర కార్తిక మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో సోమవారం పౌర్ణమి జాతర వైభవంగా జరిగింది.ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు కరీంనగర్‌, వరంగర్‌, నిజమాబాద్‌ జిల్లాల నుంచి సుమారు 70వేల మందికి హాజరయ్యారు. గుట్ట కింద నుంచి ఘాటు రహదారి గుండా స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. లడ్డూ ప్రసాదాలు, వ్రతాల రసీీదులకు రెండేసి కౌంటర్లను ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్‌కు గుట్ట కింద స్థలాన్ని చదును చేయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో వడ్లూరి అనూష తెలిపారు.

వేలాదిగా సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. గుట్టపై ఉన్న ధ్వజస్తంభం వద్ద, గుట్ట కింద గల రావి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. గూడెం గోదావరి వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలి.. గంగమ్మతల్లికి పూజలు చేశారు.