ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు

భారత మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాజకీయనేత ప్రణభ్ ముఖర్జీ కన్నుమూశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా చికిత్స పొందుతోన్న ఆయన ఆర్మీ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. బ్రెయిన్ సర్జరీ అనంతరం కోమాలోకి వెళ్లారు ప్రణబ్. అప్పటినుండి వెంటిలెటర్‌ పైనే చికిత్స అందిస్తుండగా పరిస్ధితి క్షీణించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్‌లోని మిరితిలో జన్మించారు. 2012, జులై 25 నుంచి 2017, జులై 25 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. 1969లో ఇందిరా గాంధీ హయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 1973లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా, ఆర్థిక మంత్రిగానూ సేవలందించారు. 2012లో యూఏపీ మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచి పీ.ఏ. సంగ్మాను ఓడించారు. 70శాతం ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవీకాలం పూర్తయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ప్రణబ్ ముఖర్జీ.