ఇన్నోవేషన్స్‌ సమాజంపై ప్రభావం చూపాలి..

ఇన్నోవేషన్స్‌ సమాజంపై ప్రభావం చూపాలని, అలాగే సరసమైన ధరల్లో అందుబాటులో ఉండాలని కేంద్ర రైల్వేమంత్రి పీయూల్‌ గోయల్‌ అన్నారు. గ్లోబల్‌ బయో ఇండియా స్టార్టప్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొని, ప్రసంగించారు. మన స్టార్టప్‌లు, యువ నిపుణులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు ప్రపంచస్థాయిలో రాణిస్తున్నారని, మన పిల్లలకు మెరుగైన భవిష్యత్‌ ఉండేలా భారత్‌ అభివృద్ధిలో ముందంజలో ఉంటుందన్నారు. దేశ పురోభివృద్ధిపై తన అభిప్రాయం వ్యక్తంచేశారు. కొత్త టెక్నాలజీలు దేశానికి సేవనందిస్తాయని, భవిష్యత్‌లో సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేందుకు దోహదపడుతాయన్నారు. యువ స్టార్టప్‌ల సృజనాత్మకత, ముందు చూపు, వారి ప్రదర్శనలను కేంద్రమంత్రి అభినందించారు.

దేశీయ స్టార్టప్‌లను ప్రయోగాత్మకంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వైఫల్యాలకు భయపడొద్దని, అప్పుడే ఏది సరైందో.. కాదో తెలుస్తుందని, ఈ అభ్యాసన భవిష్యత్‌లో సహాయపడుతుందన్నారు. ఈ సందర్భంగా పరిశోధన, ఆవిష్కరణలు, కొత్త టెక్నాలజీలో భారతదేశ సామర్థ్యం, పరాక్రమాన్ని ప్రదర్శించారని, ఇందుకు కృషి చేసిన డీబీటీని ప్రశంసించారు. బయోటెక్నాలజీ రంగంలో దేశంలో నాలుగువేల స్టార్టప్‌లు ఉన్నాయని, ఈ విభాగం సమకాలీన, వృత్తిపరమైన విధానం నిర్ధారిస్తుందన్నారు. ఈ సందర్భంగా డీబీటీ ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌ను, అలాగే ఐదు కొత్త టెక్నాలజీలను సైతం ప్రారంభించారు.