కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ప్రశాంత్ కిశోర్?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో నిన్న ప్రశాంత్ కిశోర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు, 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలపై వీరు చర్చించారని పైకి చెపుతున్నప్పటికీ… అంతకు మించినది ఏదో జరగబోతోందని కాంగ్రెస్ పార్టీ వర్గాలే అంటున్నాయి.

2024 ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను ప్రశాంత్ కిశోర్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్… ఆ పార్టీ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన మాట్లాడుతూ… ఇకపై తాను వ్యూహకర్తగా పని చేయబోనని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నకు బదులుగా… తానొక విఫల నేతనని చెప్పారు. గతంలో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూలో చేరిన ప్రశాంత్ కిశోర్… ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్లబోతున్నట్టు చెపుతున్నారు.