వీధి వ్యాపారుల కోసం ఆన్‌లైన్‌ వేదిక సిద్ధం

వీధి వ్యాపారుల కోసం ఆన్‌లైన్‌ వేదికను సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్బర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర లబ్ధిదారులతో వర్చువల్‌లో మోదీ ముచ్చటించారు. కేవలం రెండు నెలల వ్యవధిలో లక్షలాదిమందికి పథకం ప్రయోజనాలను అందించినందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించారు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారితో చిన్నాభిన్నమైన పేద వీధి విక్రేతల కోసం పీఎం స్వనిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్‌ 1న అమల్లోకి తెచ్చింది.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌ను చూసి మిగిలిన రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సాంకేతికతను ఉపయోగించుకుని వీధి విక్రేతల కోసం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వీధి విక్రయదారులు ముందుకొస్తే కేంద్రం మరింత చేయూతనిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. గత మూడు నాలుగేళ్లుగా డిజిటల్‌ పేమెంట్స్‌ అధికంగా అవుతున్నాయని, కరోనా సమయంలో ఎంతో ఉపయుక్తంగా మారిందని వివరించారు. ఇప్పుడు వినియోగదారులు నగదు బదులు డిజిటల్‌ చెల్లింపులు చేయడానికే మొగ్గు చూపుతున్నట్లు వెల్లడించారు. అందుకే విక్రయదారులు కూడా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలని కోరారు. పీఎం స్వనిధి పథకంలో చేరేందుకు సులువైన నిబంధనలను పెట్టినట్లు చెప్పారు. తీసుకున్న రుణం గడువులోగా కట్టేస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఒకవేళ డిజిటల్‌ లావాదేవీలు జరిపినట్లయితే రివార్డుతోపాటు మరోసారి అధికమొత్తం లోన్‌ పొందే అవకాశం ఉంటుందని ప్రధాని వివరించారు.