సన్‌రైజర్స్ పరాజయాలకు అడ్డుకట్ట. కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి!

వరుస పరాజయాలతో విసుగుపుట్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊరట విజయం లభించింది. నాలుగు మార్పులతో బరిలోకి దిగిన రైజర్స్​ ఐదు ఓటముల తర్వాత గెలుపు రుచి చూసింది. టార్గెట్‌ ఛేజింగ్‌లో జేసన్‌ రాయ్‌ (42 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 60) హిట్టింగ్‌కు తోడుగా కెప్టెన్‌ విలియమ్సన్‌ (41 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్‌) నిలకడగా ఆడటంతో.. సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 164/5 స్కోరు చేసింది. సంజూ శాంసన్‌ (57 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా, యశస్వి జైస్వాల్‌ (36) అండగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 167/3 స్కోరు చేసి నెగ్గింది. విలియమ్సన్‌, అభిషేక్‌ (21 నాటౌట్‌) నాలుగో వికెట్‌కు 48 రన్స్‌ జోడించారు. రాయ్​కు ‘ప్లేయర్​ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

శాంసన్‌ ధనాధన్​..

రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌కు శాంసన్‌ వెన్నెముకలా నిలిచాడు. ఓపెనర్​ లూయిస్‌ (6)ను రెండో ఓవర్‌లోనే భువనేశ్వర్​ (1/28) ఔట్​ చేసినా.. యశస్వి, శాంసన్‌ కౌంటర్‌ అటాక్‌కు దిగడంతో పవర్‌ప్లేలో రాజస్తాన్‌ 46/1 స్కోరు చేసింది. ఆతర్వాత కూడా ఈ ఇద్దరూ జోరు కొనసాగించారు. అయితే 9వ ఓవర్లో సందీప్‌ (1/30) బాల్‌ను భారీ సిక్సర్‌గా మలిచిన యశస్వి నెక్స్ట్‌ బాల్‌కు క్లీన్‌బౌల్డ్‌ అవడంతో సెకండ్‌ వికెట్‌కు 56 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ ముగిసింది. 11వ ఓవర్‌లో టీమ్​కు మరో దెబ్బ తగిలింది. మళ్లీ బౌలింగ్​కు వచ్చిన రషీద్‌ (1/31).. లివింగ్‌స్టోన్‌ (4)ను ఔట్‌ చేశాడు. ఈ దశలో శాంసన్​కు తోడైన మహిపాల్‌ లామ్రోర్​ (29) నిలకడగా ఆడాడు. హోల్డర్‌ బాల్‌ను స్టాండ్స్‌లోకి పంపి టచ్‌లోకి వచ్చాడు. రెండోఎండ్‌లో శాంసన్‌.. రషీద్‌, సిద్దార్థ్​ కౌల్‌ (2/36) బౌలింగ్‌లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. దీంతో 41 బాల్స్‌లో ఫిఫ్టీ కంప్లీట్‌ చేసుకున్నాడు.ఈ క్రమంలో రాయల్స్‌ స్కోరు 150 దాటింది. అయితే, లాస్ట్‌ ఓవర్లో శాంసన్‌, రియాన్‌ పరాగ్‌ (0)ను ఔట్‌ చేసిన కౌల్‌ రాజస్తాన్​ను కట్టడి చేశాడు.

రాయ్‌ ఓపెనింగ్​.. కేన్​ ఫినిషింగ్​

వార్నర్​ ప్లేస్​లో బరిలోకి దిగిన జేసన్​ రాయ్​.. ఛేజింగ్​లో మరో ఓపెనర్​ సాహా (18)తో కలిసి హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన సాహా.. థర్డ్‌ ఓవర్‌లో 6, 4తో 12 రన్స్‌ రాబట్టాడు. ఇంకోవైపు సీజన్​లో ఫస్ట్​ మ్యాచ్​ ఆడుతున్న రాయ్‌ వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో 4.5 ఓవర్లలోనే 50 రన్స్‌ వచ్చేశాయి. అయితే ఆరో ఓవర్‌లో లామ్రోర్​.. సాహాను ఔట్‌ చేయడంతో ఫస్ట్‌ వికెట్‌కు 57 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ బ్రేక్‌ అయ్యింది. పవర్‌ప్లేలో 63/1 స్కోరు చేసిన హైదరాబాద్‌ స్కోరు బోర్డును రాయ్‌, కేన్​ విలియమ్సన్‌ వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ఎక్కువగా సింగిల్స్‌ తీస్తూ 6 రన్‌రేట్‌ తగ్గకుండా చూశారు. పదో ఓవర్లో కేన్​ భారీ సిక్సర్‌ బాదగా.. సగం ఓవర్లకు 90/1 స్కోరుతో రైజర్స్​ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆపై, తెవాటియా బౌలింగ్​లో రాయ్‌ 6, 4, 4, 4తో 21 రన్స్‌ పిండుకున్నాడు. కానీ, ఏడు బాల్స్‌ తే డాతో రాయ్‌, ప్రియమ్‌ గార్గ్‌ (0) వెనుదిరగడంతో రైజర్స్​ ఒత్తిడిలో పడింది. ఈ టైమ్‌లో అభిషేక్‌ భారీ షాట్లకు పోకుండా స్ట్రయిక్‌ రొటేట్‌ చేశాడు. గెలవాలంటే 18 బాల్స్‌లో 22 రన్స్‌ కావాల్సిన దశలో అభిషేక్‌ భారీ సిక్సర్‌, విలియమ్సన్‌ ఫోర్‌ బాది మ్యాచ్​ను తమవైపు లాగేసుకున్నారు. తర్వాతి ఓవర్‌లో విలియమ్సన్‌ రెండు ఫోర్లతో గెలుపు లాంఛనం పూర్తి చేశాడు.