ఇండియాకు కృతజ్ఞతలు తెలిపిన నేపాల్‌ ప్రధాని

మిలియన్‌ డోసుల కరోనా వ్యాక్సిన్‌ సరఫరా చేసిన భారత్‌కు నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ఖాట్మండులో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో ముందస్తుగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అవకాశం లభించిందని, ఇందుకు సహకరించిన భారత ప్రజలు, ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన వారంలోనే తమ దేశానికి వ్యాక్సిన్‌ పంపారన్నారు. నేపాల్‌లో టీకా డ్రైవ్‌ మూడు నెలల్లో పూర్తవుతుందని ప్రకటించారు. నేపాల్‌ వ్యాప్తంగా 62 ఆసుపత్రుల్లో 120 కేంద్రాలను ఏర్పాటు చేసి కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు టీకాలు వేస్తోంది. మొదటి దశలో 4.50లక్షల మంది ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు భారత్‌ బహుమతిగా అందించిన మిలియన్‌ డోసుల ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్లను వేస్తున్నట్లు నేపాల్‌ ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ‘కొవిషీల్డ్‌’ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. గత వారంలో భారత ప్రభుత్వం నేపాల్‌తో సహా పలు దేశాలకు వ్యాక్సిన్లను కానుకగా అందజేసింది. భారత్‌లో మంగళవారం నాటికి దాదాపు 70 జిల్లాలకు ఈ వ్యాక్సిన్ పంపించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. డీసీజీఐ జనవరి 15న ‘కోవిషీల్డ్’ అత్యవసర అనుమతి ఇచ్చింది. టీకాను రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత వద్ద ఆరు నెలలు నిల్వ చేయవచ్చు. దేశ మొత్తం జనాభాలో 72 శాతం మందికి కొవిడ్‌-19కు వ్యతిరేకంగా టీకాలు వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.