సంజయ్‌కి ప్రధాని ఫోన్.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి

గ్రేటర్‌లో మంగళవారం నాడు ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం విదితమే. నిన్నజరిగిన ఎన్నికల పరిస్థితులపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాల్ సంభాషణకు సంబంధించి బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. సుమారు 10 నిమిషాల పాటు తనతో ఎన్నికల పరిస్థితులపై మోదీ ఆరా తీశారన్నారు. ‘గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని మోదీ అభినందించారు. నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులపై వివరాలు ప్రధాని అడిగి తెలుసుకున్నారు. నూతన ఉత్సాహంతో ఉన్న పార్టీ క్యాడర్‌ పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ధైర్యంగా ముందుకు సాగాలని అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు’ అని బండి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.