‘ట్రాక్టర్‌ ర్యాలీ’లో అరెస్టయిన రైతులకు పంజాబ్‌ ప్రభుత్వ ఆర్థిక సాయం

 ఢిల్లీ ‘ట్రాక్టర్‌ ర్యాలీ’ లో అరెస్టయిన రైతులకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

సిఎం చన్నీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ… ” మూడు నల్ల సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న రైతు ఉద్యమానికి మా ప్రభుత్వం మద్దతు ఉంటుందని మరోసారి పునరుద్ఘాటిస్తున్నా. జనవరి 26 న ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీ చేపట్టినందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన 83 మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని అందించాలని నిర్ణయించాం ” అని పేర్కొన్నారు. ఈ తాజా నిర్ణయంతో కేంద్రం, పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మధ్య కొత్త వివాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గతేడాది నవంబరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళనల్లో భాగంగా… ఈ ఏడాది జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసులు అనుమతించిన రూట్లలో కాకుండా కొందరు ఆందోళనకారులు మరో మార్గంలో వెళ్లి చారిత్రక ఎర్రకోటను ముట్టడించి కోటపై జెండాను ఎగురవేశారు. అడ్డుకున్న పోలీసులతోనూ ఘర్షణలకు దిగారు. హింసాత్మక ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి 83 మంది రైతులను అరెస్టు చేశారు. తాజాగా ఆ రైతులకు పంజాబ్‌ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ సంఘీభావాన్ని తెలిపింది.