టీమిండియాకు క్వారంటైన్ కష్టాలు

ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్‌కు క్వారంటైన్ కష్టాలు ఇప్పట్లో పోయేలా లేవు. ఎక్కడికి వెళ్తే అక్కడ క్వారంటైన్ తప్పనిసరి అని చెబుతుండటంతో ప్లేయర్స్ విసుగు చెందుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా టూర్‌ను ఘనంగా ముగించి స్వదేశానికి చేరుకున్న ప్లేయర్స్‌కు ఇక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. ఇక్కడ కూడా హోమ్ క్వారంటైన్ తప్పనిసరి అని వాళ్లకు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లోనే వాళ్లకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నిర్వహించారు. క్వారంటైన్ నుంచి ఎవరికీ మినహాయింపు లేదని, అందరకూ కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని బృహన్‌ముంబై కార్పొరేషన్ కమిషన్ ఇక్బాల్ చాహల్ స్పష్టం చేశారు.

గురువారం తెల్లవారుఝామున దుబాయ్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు టీమిండియా ప్లేయర్స్‌. అక్కడి నుంచి పంత్ ఢిల్లీకి, సిరాజ్ హైదరాబాద్‌కు.. ఇతర ప్లేయర్స్ వారి వారి ఊళ్లకు వెళ్లారు. అయితే ఎక్కడికి వెళ్లినా ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని వాళ్లకు అధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లిన సందర్భంలో, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టీమిండియా ప్లేయర్స్ ఇలా క్వారంటైన్ పేరుతో నెల రోజులకుపైగా క్వారంటైన్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే.