రఘురామకృష్ణరాజు అరెస్ట్‌: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా హైకోర్టు, మెజిస్ట్రేట్‌ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు నిలదీసింది.

మధ్యాహ్నం 12 గంటలకు వైద్య నివేదిక ఇవ్వాలని చెప్పినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్‌ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.