విపక్ష సభ్యుల నిరసనను ఖండించిన రాజ్‌నాథ్ సింగ్

ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ఆమోదింప చేసే సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టిన నిరసనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. ఆ ఘటనను ఖండిస్తూ.. తాను కూడా రైతునే అని, రైతులను ప్రభుత్వం నష్టపరుస్తుందని ఎప్పుడూ నమ్మవద్దు అని రాజ్‌నాథ్ తెలిపారు. పార్లమెంట్‌లో విపక్ష సభ్యుల ప్రవర్తన.. ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు అన్నారు. క్యాబినెట్ మంత్రులతో కలిసి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు రైతులను తమ నిరసనతో గందరగోళంలో నెట్టివేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకవేళ విపక్ష సభ్యులు చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటే, కానీ అలా హింసాత్మకంగా వ్యవహరించడం సమంజసమేనా, చైర్‌పైకి ఎక్కి మైక్‌లను పగులగొడుతారా అని రాజ్‌నాథ్ ప్రశ్నించారు. డిప్యూటీ చైర్మన్ పట్ల సభ్యులు ప్రవర్తించిన తీరు దురదృష్టకరమన్నారు. చైర్ వైపు వెళ్లి రూల్‌బుక్‌ను చింపివేయడం రాజ్యసభ చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. అగ్రి బిల్లులు పాసైన రీతిని ఖండిస్తూ విపక్షాలకు చెందిన 45 మంది సభ్యులు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.