ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లుకు సభ ఆమోదం

హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ర్టంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 ఏండ్లుగా ఉంది. ప్రస్తుతం రాష్ర్టంలో 4వ తరగతి ఉద్యోగులకు రిటైర్డ్ వయసు 60 ఏండ్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధన సిబ్బందికి పదవీ విరమణ వయసు 65 ఏండ్లుగా ఉందన్నారు. అయితే న్యాయసిబ్బిందికి రిటైర్డ్ వయసు 60 ఏండ్లుగా ఉందన్నారు.

మన దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60, 62 ఏండ్లుగా ఉందని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగుల అనుభావాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

రిటైర్డ్ వయసు పెంపుదల వల్ల ఖాళీల భర్తీ విషయంలో ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి ఖాళీల భర్తీని చేపడుతామన్నారు. రాష్ర్టంలో 50 వేల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. త్వరలోనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.