కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రతన్‌ టాటా

ముంబయి: కరోనా వ్యాక్సినేషన్‌ రెండవ దశలో భాగంగా ప్రముఖులు టీకా తీసుకుంటున్నారు. మార్చి 1 నుండి ప్రారంభమైన ఈ దశలో 60 ఏళ్లకు పైబడిన వారితో పాటు దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ తదితర ప్రముఖులు సైతం టీకా తీసుకున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కూడా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని టాటా తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. టీకా తీసుకున్న సమయంలో నొప్పిగా అనిపించలేదని, అందరూ త్వరలోనే వ్యాక్సిన్‌ వేసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 2.8కోట్ల మంది టీకాలు వేయించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 20,53,457 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ప్రముఖ సంస్థలు సైతం తమ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు టీకాలను అందిస్తామని ప్రకటించాయి.