కుంగ్ ఫూ ఛాంపియన్ సతీష్ కుమార్ కు అభినందనలు

ఏలూరు: కరాటే, కుంగ్ ఫూ నేషనల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న ఏలూరు 13 డివిజన్ కు చెందిన బొలిశెట్టి సతీష్ కుమార్ ను జనసేన పార్టీ ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు అభినందించారు. ఆత్మపక్షణకు ఎంతగానో ఉపయోగపడే కరాటే, కుంగ్ ఫూను ఆదరించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన సతీష్ కుమార్ అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఏలూరు నగరానికి గర్వకారణం అని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. తెలంగాణకు చెందిన క్రీడాకారుడు నేషనల్ ఛాంపియన్ షిప్ లో మూడో స్థానం సాధిస్తే అక్కడ ప్రభుత్వం 40 వేల రూపాయలు అందజేసి గౌరవించిందన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన బొలిశెట్టీ సతీష్ కుమార్ కు మాత్రం జగన్ ప్రభుత్వం ఏ విధమైన సహాయం అందించలేదన్నారు. ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సతీష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయస్థాయిలో ఏలూరు నగరానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన సతీష్ కుమార్ అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పథకం సాధించాలని, సహాయ సహకారాలు అందిస్తానని రెడ్డి అప్పలనాయుడు చెప్పారు. నేషనల్ ఛాంపియన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ చిన్ననాటి నుండే యంగ్ మాస్టర్స్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో మాస్టర్ ఆర్ వేణుగోపాల్ శ్రీనివాస్ వద్ద కరాటే, కుంగ్ ఫూ లో శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పారు. మాస్టర్ వేణుగోపాల్ శ్రీనివాస్ ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా పోటీల్లో పాల్గొనేందుకు పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. 2014లో గుంటూరులో జరిగిన స్టూడెంట్ నేషనల్ ఒలింపిక్స్ లో ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నానని తెలిపారు. ఇంటర్నేషనల్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమన్నారు. నేషనల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న సతీష్ కుమార్ ను జనసేన పార్టీ నగర కార్యదర్శి కూర్మ సరళ అభినందించారు.