క్షేత్రస్థాయిలో స్పందన సమస్యలను పరిష్కరించాలి

  • గ్రామ, వార్డు సచివాలయ, మండల, మున్సిపాలిటీ స్థాయిలో సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలి
  • అక్కడ పరిష్కారం కాకపోవడంతోనే వారం వారం జిల్లా కలెక్టర్ స్పందనకు అధికంగా అర్జీలు
  • అర్జీదారులకు వ్యయ ప్రయాసలు లేకుండా చూడాలని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: జగనన్నకు చెబుదాం పేరుతో ప్రతి సోమవారం గ్రామ, వార్డు, మండల, మున్సిపాలిటీ, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. ఆదివారం జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించాల్సిందిగా సమర్పించిన అర్జీలు పరిష్కారం కావడంలేదని పదేపదే వెళ్లి అర్జీలు సమర్పించినా లాభం ఉండటం లేదని పలువురు అర్జీదారులు తమ వద్ద వాపోయినట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామ, వార్డు, మున్సిపాలిటీ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పరిష్కారానికి సంబంధిత అధికారులు శ్రద్ధ చూపెట్టకపోవడంతో అర్జీదారులు పలు వ్యయ ప్రయాసలకులోనై జిల్లా కేంద్రానికి చేరుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందనలో సమస్యలు పరిష్కారానికి అర్జీలు సమర్పిస్తున్నారున్నారు. ఇందులో అధికంగా నిరక్షరాస్యులు పలుకుబడి లేని అనాధలే ఉంటున్నారన్నారు. ప్రతి సోమవారం దాదాపు 100కు పైగా వస్తుండడం చూస్తే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం జరగట్లేదని అర్థమవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన అర్జీలు కూడా సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం కావడం లేదని కొందరు అర్జీదారులు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశారున్నారు. ఎవరైనా సమస్య పరిష్కరించాలని అర్జీ పెడితే పరిష్కారం చేసేందుకు వచ్చిన అధికారులు తమకే ఆధారాలు తీసుకురావాలని లేదా అనవసరమైన ఫిర్యాదులు చేస్తున్నారంటూ తమని నిందిస్తున్నారని అర్జీదారులు వాపోతున్నారన్నారు. వారం వారం జరిగే అర్జీదారుల సమస్యలు పరిష్కారం నిమిత్తం ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. అలాగే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించి అర్జీదారులు జిల్లా కేంద్రానికి వచ్చే ప్రయాస తగ్గించాలని కోరారు.