ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది: రియా చక్రవర్తి

‘‘సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ను సోషల్‌ మీడియా వేదికగా కోరిన బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి.

గత నెల 14న సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ‘‘గౌరవనీయులైన అమిత్‌ షాగారికి.. నేను సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ని.. సుశాంత్‌ మనందరికీ దూరమై నెలరోజులు గడిచిపోయాయి. ప్రభుత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయాన్ని విశ్వసిస్తాను. సుశాంత్‌ మృతిపై సీబీఐ పరిశోధన జరిపించాలని నేను మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను, సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేందుకు ఎటువంటి కారణాలు ప్రేరేపించాయో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సత్యమేవ జయతే’’ అని పేర్కొన్నారు రియా.

సుశాంత్‌ మరణంపై సీబీఐ పరిశోధన జరిపాలని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది సినీవాసులు డిమాండ్‌ చేశారు. మరోవైపు సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి రియా ఓ కారణం అంటూ కొందరు సోషల్‌ మీడియాలో అసభ్యంగా కామెంట్స్‌ చేస్తున్నారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సోషల్‌ మీడియా వేదికగా రియా కంప్లయింట్ చేశారు.