రామాలయ నిర్మాణంలో లంక నుంచి ప్రత్యేకంగా శిల

అయోధ్యలో సర్వాంగ సుందరంగా రామాలయం నిర్మితమవుతోంది. చారిత్మాత్రక ప్రాధాన్యత సంతరించుకునేందుకు రామాయణంలో ప్రాశస్త్యం కలిగిన లంక నుంచి శిలను తీసుకురానున్నారు.

ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామాలయం నిర్మాణం అత్యంత వైభవంగా నిర్మితమవుతోంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రామాలయ నిర్మాణం కోసం పెద్దఎత్తున విరాళాలు వచ్చాయి. ప్రస్తుతం నిర్మితమవుతున్న రామజన్మభూమి పరిసరాలకు 2-3 కిలోమీటర్ల దూరంలో 1 లక్షా 15 వేల చదరపు అడుగుల అదనపు భూమిని శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ కొనుగోలు చేసింది. ట్రస్ట్ కార్యకలాపాలు, భద్రతా సిబ్బంది, భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పన కోసం ఈ భూమిని వినియోగించనున్నారు. రామ్‌కోట్, తెహ్రి బజార్ ప్రాంతంలోని భూమిని చదరపు అడుగు 690 చొప్పున మొత్తం 8 కోట్ల రూపాయలకు గతవారంలో కొనుగోలు చేశారు.

ఇప్పుడు ఈ రామాలయానికి చారిత్రాత్మక ప్రాధాన్యత సంతరించేందుకు రామాయణంలో ప్రాశస్త్యం కలిగిన లంక నుంచి శిల ను తీసుకురానున్నారు. లంకాధీశుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి బంధించిన చోటుగా రామాయణంలో చెబుతున్న స్థలం నుంచి ఓ శిలను సేకరించి అయోధ్య  రామాలయ నిర్మాణానికి అందిస్తామని కొలంబోలోని భారత హైకమీషనర్ కార్యాలయం తెలిపింది. రెండు దేశాల మైత్రీబంధానికి ఇది నిదర్శనమన్నారు. సీతా ఎలియాగా పేర్కొంటున్న ప్రాంతం నుంచి సేకరించిన శిలను త్వరలో శీలంక హైకమీషనర్ భారత్‌కు తీసుకురానున్నారు.