నివర్ తుఫాన్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా

నివర్ తుపాను బీభత్సం సృష్టించింది. నివర్ తుఫాన్ కారణంగా ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రధాని మోదీ మామీ ఇచ్చారు. గాయపడ్డవారికి రూ.50వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం(నవంబర్ 27) తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో మాట్లాడిన సందర్భంగా ప్రధాని ఈ హామీలిచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తమిళనాడులో తుఫాన్ ప్రభావిత పరిస్థితులను సీఎంను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల కోసం కేంద్ర బృందాలు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ తమిళనాడులో తుఫాన్ కారణంగా నలుగురు చనిపోయినట్లు సీఎం పళనిస్వామి ప్రధాని మోదీకి తెలిపారు .చాలాచోట్ల వృక్షాలు నేలకొరిగినట్లు చెప్పారు.పెద్ద సంఖ్యలో పశువులు మేకలు మృత్యువాత పడినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు పేర్కొన్నారు.

కాగా,నివర్ తుఫాన్ నుంచి తేరుకోకముందే తమిళనాడుకు మరో తుఫాన్ గండం పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రాగల 48గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 30న అది బలపడి పుదుచ్చేరి వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దాని ప్రభావంతో తమిళనాడు,పుదుచ్చేరిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.