వైద్యులకు, వైద్యసిబ్బందికి సమయానికి జీతాలు చెల్లించండి..!: దారం అనిత డిమాండ్

ప్రభుత్వాలు తమ వార్షిక ప్రణాళికలో గానీ, తమ అయిదేళ్ల పరిపాలనా కాలంలో గానీ ప్రాముఖ్యతను ఇచ్చే ప్రధాన అంశాలలో ఒకటి “ప్రజారోగ్యం”. వివిధ వ్యాధులతో బాధపడే రోగులకు సౌకర్యాలు కల్పించడం, ఆయా వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచడం ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యం. దాంతోపాటు వైద్య పరీక్షలకి సంబంధించిన పరికరాలను, సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలి. పేదలు, సామాన్యులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తుంటారు. కాబట్టి అక్కడి సిబ్బందిని జాగ్రతగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై చాలా ఎక్కువగా ఉంది.

కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైద్య సిబ్బందిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మెరుగైన వసతులు ఉండవు. రోగుల సంఖ్యకు తగ్గ సిబ్బంది లేకపోవడం వలన ఉన్నవారి మీద అధిక పని భారం పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవి చాలవు అన్నట్లు ఇప్పుడు కొన్ని జిల్లాల్లో వైద్యులకు, వైద్యసిబ్బందికి మూడు నెలల నుంచి జీతాల్లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి జీతాలు అందక ఆందోళన చేస్తున్నారు. వైద్య విధాన పరిషత్ లోని సుమారు 5,732 మంది రెగ్యులర్, 2,436 ఒప్పంద, 1,828 ఒప్పంద ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు పడతాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి జీతాలు రాకపోతే ఎవరు మాత్రం నిబద్ధతతో పని చేస్తారు. దీనివల్ల పేదలు, సామాన్యుల ఆరోగ్యాల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. జీతం అందక ఇబ్బందులుపడుతున్న ప్రకాశం జిల్లా డి.సి.హెచ్.ఎస్ చిన్నపిల్లల అధికారి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విడియో సామాజిక మాధ్యమాల్లో చూసి నాకు చాలా బాధ అనిపించింది.

ఆరోగ్యశాఖ మంత్రి గారూ.. దేశంలో మనది గొప్ప వైద్య విధానం అని మీడియా సాక్షిగా మీరు ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవంలో వైద్యులకు, వైద్యసిబ్బందికి కనీసం నెల వారి జీతాలు సమయానికి ఇవ్వలేకపొతున్నారు. జీతాల్లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది అవసరాలు తెలుసుకుని త్వరగా వారి జీతాలు విడుదల చేయాలి అని జనసేన పార్టీ తరపున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేశారు.