సర్వపాడు మృతులకు సాయం చేయాలి

  • మృతదేహాలతో జిల్లా ఆసుపత్రి, ఐటిడిఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన జనసేన, సిపిఎం, టిడిపి నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, సర్వపాడు గ్రామంలో శుక్రవారం ఇంటి గోడ కూలి మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలకు ఆర్ధికంగా సాయం చేయాలని కోరుతూ శనివారం జనసేన, సిపిఎం, టిడిపి తదితర పార్టీ నాయకులు జిల్లా ఆసుపత్రి, ఐటిడిఏ కార్యాలయం వద్ద మృతదేహాలతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, చినకేర్జీల సర్పంచ్ హిమరిక గంగాధర్, వంగల దాలి నాయుడు, సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు తోయక జగదీశ్వరి, శేఖర్ పాత్రుడు, గులిపల్లి సుదర్శనరావు, దేవకోట వెంకటనాయుడు, కోలక ధర్మారావు, బలరాం నాగేశ్వర రావు మారడాన తిరుపతి నాయుడు, మెరిశర్ల సింహాచలం, పడాల హరి ప్రసాద్, వప్పంగి రాఘవేంద్ర, బత్తీల శ్రీను, పాలక నూకరాజు, నందివాడ కృష్ణబాబు, చినకేర్జీల మాజీ సర్పంచ్ నందిగాన ప్రసాద్ తదితరులు జిల్లా ఆస్పత్రి వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించిన మృతదేహాలను ఐటిడిఏ కార్యాలయం వద్దకు ర్యాలీగా తీసుకువెళ్లి ఐటిడిఏ కార్యాలయం వద్ద మృతదేహాలతో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కొమరాడ మండలంలో అంటివలస ఆటో ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం నయా పైసా కూడా చెల్లించలేదన్నారు. గిరిజనులు ప్రమాదభారిన పడి మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాలు వీధిపాలవుతున్నాయన్నారు. సంబంధిత పాలకులకు, అధికారులకు కొంచెం కూడా పట్టడం లేదన్నారు. పాలకులు, అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో ఆయా కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయన్నారు. సర్వపాడు గ్రామంలో ఇంటి గోడ కూలి మృతి చెందిన శంకర్రావు, మాణిక్యమల కుటుంబాలతోపాటు గాయపడిన వారి కుటుంబాలకు ఎక్సగ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా వారు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు శరణ్ ను కలసి ఆయా కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయాలని కోరారు. దీనికి ఐటీడీఏ పీవో నిధులు లేవంటూ తేల్చి చెప్పడంతో వారు వెనుతిరిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరడంతో చివరికి ప్రభుత్వాసుపత్రిలో ఉన్న అంబులెన్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటిడిఎ ఉన్న గిరిజనులకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. గిరిజనులను ఆదుకోవటంలో ఐటీడీఏ విఫలం అయ్యుందని గ్రామానికి చెందిన పలువురు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.