అన్ని వర్గాలకు సంతృప్తికరంగా బడ్జెట్‌ ఉంది: ప్రధాని మోదీ

కేంద్ర  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్-2021పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అన్ని వర్గాల వారిని సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్ ఉందని కితాబునిచ్చారు. సంక్షేమానికి పట్టం కట్టిన బడ్జెట్ అని పేర్కొన్నారు. మౌలిక వసతులకు ఇందులో పెద్దపీట వేశామని చెప్పారు. పారదర్శకతతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టామని, దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి బాటలో నడిపిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ తో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి తీరప్రాంత రాష్ట్రాలు శక్తి కేంద్రాలుగా మారతాయని అన్నారు.

అన్నింటికి మించి ఇది సామాన్యుడికి అండగా నిలిచే బడ్జెట్ అని స్పష్టం చేశారు. అభివృద్ధితో పాటే ఉద్యోగ కల్పనకు చేయూతనిస్తుందని వివరించారు. ఈ బడ్జెట్ ను ప్రధానంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్టు మోదీ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ల బలోపేతానికి చర్యలు తీసుకున్నామని, ఆరోగ్యరంగం బలోపేతం దిశగా బడ్జెట్ లో నిధులు కేటాయించామని వెల్లడించారు.