శివరాత్రి మహత్యం!

మన సంస్కృతిలో ఎన్నో పండుగలు ఉన్నాయి. అందులో మహా శివరాత్రికి ప్రత్యేక విశిష్టత ఉంది. చాంద్రమాన మాసంలోని 14వ రోజును(చతుర్దశిని) మాస శివరాత్రి అంటారు. అదే మాఘ బహుళ చతుర్దశి రోజు వచ్చే శివరాత్రిని మహా శివరాత్రి అంటారు. దీనికి ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాధాన్యం ఉంది. ఈ రోజునే శివుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున ఉపవాసం, శివార్చన, జాగరణ చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది.

శివరాత్రి రోజు స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం అంత శ్రేష్ఠమైంది. అయితే కొందరు రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం భోజనం చేస్తుంటారు. మరికొందరు శివరాత్రి రోజు పగలంతా ఏం తినకుండా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత భోజనం చేయడం ఒక ఆచారం. దీన్నే నక్తం అంటారు. మరికొందరు పగటి పూట ఏదో ఒకటి తిని.. రాత్రి ఉపవాసం ఉంటారు. దీన్ని ఏక భుక్తం అంటారు.

అసలు శివరాత్రి మహత్మ్యం అంతా రాత్రి వేళల్లోనే ఉంటుంది. అందుకే భక్తులు రాత్రంతా జాగరణ చేస్తుంటారు. భజనలు, పురాణ కాలక్షేపం లేదా శివనామస్మరణలతో రాత్రంతా గడుపుతారు. మరికొందరైతే అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు చేసి మహాశివుడి కృపా కటాక్షాలు పొందుతారు.

మహాశివరాత్రి ఎలా వచ్చింది?

పూర్వం బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తికి ఓ వివాదం వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ వాదించుకున్నారు. వారద్దరి మాయలు తొలగించి, తగవు తిర్చేందుకు పరమేశ్వరుడు.. బ్రహ్మ, విష్ణువుల మధ్య జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. తన ఆద్యంతాలు ఎవరు కనుక్కొని వస్తారో వాళ్లే గొప్ప అని శివుడు చెబుతాడు జ్యోతిర్లింగం మొదలు కనిపెట్టడానికి బ్రహ్మ, చివర కనిపెట్టడానికి విష్ణువు బయలుదేరతారు. కానీ ఎంతదూరం వెళ్లిన వారికి ఆద్యంతాలు కనిపించవు. అంతం కనుక్కోలేక విష్ణువు వెనుదిరిగి వస్తాడు. బ్రహ్మ మాత్రం తాను మొదలు కనుక్కున్నానని అబద్ధం చెప్తాడు. దారి మధ్యలో కనిపించిన కామధేనువు, మొగలిపువ్వును ఇందుకు సాక్ష్యంగా చూపిస్తాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మ నాలుగో ముఖాన్ని పరమేశ్వరుడు ఖండిస్తాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడానికి సహాయపడ్డ మొగలిపువ్వు పూజకు పనికి రాదని శపిస్తాడు. కామధేనువు ముఖంతో అబద్ధం చెప్పినా.. తోకతో నిజం చెప్పినందు వల్ల గోవు వెనుక భాగం పూజనీయం అవుతుందని వరమిస్తాడు శివుడు. ఇక తన ఓటమిని ఒప్పుకున్న విష్ణువుకు తనతో పాటు సమానమైన పూజలు అందుతాయని వరమిస్తాడు.

శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే శివపార్వతుల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని విశ్వసిస్తారు. అంటే సతీదేవి అగ్నిప్రవేశం తర్వాత హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది. ఆ తర్వాత శివుని కోసం ఘోర తపస్సు చేసిన పార్వతి.. ఇదే రోజు మహాశివుడిని భర్తగా పొందింది.

శివరాత్రి మహత్మ్యం చెప్పే కథ

శివుడు అభిషేక ప్రియుడు. భక్తులు శివరాత్రి రోజున లక్ష బిల్వార్చన చేసి, భక్తితో పూజించి, అభిషేకిస్తే శివానుగ్రహానికి పాత్రులవుతారు. పంచాక్షరీ మంత్ర జపంతో పునీతులవుతారు. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణ, బిల్వార్చన, అభిషేకం వంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. శివరాత్రి శివరాత్రి యొక్క విశిష్టతను ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి వివరించిన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.

పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే ఒకరోజు ఏ జంతువు దొరకలేదు. తీవ్ర నిరాశతో తిరిగి ఇంటికి వస్తున్న అతనికి దారిలో ఓ సరస్సు కనిపించింది. దీంతో వెంటనే తనకు ఓ ఆలోచన వచ్చింది. రాత్రి సమయంలో ఏదైన జంతువు నీళ్ళు తాగడానికి అక్కడకు వస్తుందేమో అని.. అప్పుడు దాన్ని పట్టుకోవచ్చని.. ఆ పక్కనే ఉన్న చెట్టుపై కూర్చున్నాడు. ఇక తనకు శివ శివ అని పలకడం అలవాటు. ఆ రాత్రంతా ఆ పేరును జపిస్తూ ఉండిపోయాడు. అయితే ఆ రోజు శివరాత్రి అని అతనికి తెలియదు. ఇక ఆ సమయంలో ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాగా.. ఆ జింక తాను గర్భం దాల్చానని.. తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. ఆ జింక మానవభాష మాట్లాడేసరికి బోయవాడు దానిని వదిలిపెట్టాడు. ఆ తర్వాత అటువైపు మరో ఆడ జింక వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపల అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూన్నానని.. పైగా బక్కచిక్కిన తన శరీరమాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరికాసేపటి దాకా ఏ జంతువూ దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకొంది. కాసేపటి తర్వాత అటువైపు వచ్చిన ఒక మగ జింక అతడికి కనిపించింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది. బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువూ దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగ జింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని చెప్తుంది.

ఇక ఉదయం మరొక జింక.. దాని పిల్ల అటుగా రావటం కనిపించింది. అది చూసిన బోయవాడి బాణం ఎక్కుపెట్టడం చూసిన జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలూ బోయవాడికిచ్చిన మాటప్రకారం సత్యనిష్ఠతో వాడిముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్సవర్తన బోయబాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టుకావటం, అతడు తెలియకుండానే శివ శివా అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం.. తన చూపునకు అడ్డంవచ్చిన మారేడు దళాలను కోసి కిందపడవేయటం చేశాడు బోయవాడు. ఆ చెట్టుకిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజాఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకూ మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. ఆ జింకలు కూడా సత్యనిష్ఠతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. అతను శివసాయుజ్యం చేరుకున్నాడు.