గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత

గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. ఎస్పీ బాలు మరణంతో తెలుగు పాట మూగపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సహా 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాల సుబ్రహ్మణం తుది శ్వాస విడిచారు.

మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు ఎస్పీ తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. అంత్యక్రియలపై కాసేపట్లో ప్రకటన చేస్తామని చరణ్ వివరించారు. గత నెల 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు బాలు. కరోనా నుంచి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు విశ్వప్రయత్నం చేశారు. వెంటిలేటర్ పై ఉంచి, ఎక్మో ట్రీట్మెంట్ అందించారు. తొలుత ఆయన క్రమక్రమంగా కోలుకుంటున్నట్లే అనిపించినా, గురువారం అకస్మాత్తుగా ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన కోట్లాది మంది అభిమానులను ఒంటరి చేస్తూ దివికేగారు.

ఎస్పీ బాలు పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. అభిమానులందరూ ఆయన్ను బాలుగా పిలుచుకుంటారు. పాటలు పాడటంతో పాటు కొన్ని సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించారు. నటుడిగా, నిర్మాతగా కూడా సినిమాపై తన అభిరుచిని చాటుకున్నారు. బాలు చివరిసారిగా పలాస సినిమాకు పాటలు పాడారు.